వాషింగ్టన్: మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది! అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరో తేలిపోయింది! తాను పుట్టిన గడ్డ పెన్సిల్వేనియాలో జెండా ఎగరేసిన బైడెన్.. అగ్ర రాజ్యానికి 46వ అధ్యక్షుడిగా తన స్థానాన్ని ఖరారు చేసుకున్నారు. హోరాహోరీ, ఉత్కంఠభరిత పోరులో డొనాల్డ్ ట్రంప్‌పై పూర్తి ఆధిక్యాన్ని సంపాదించారు. వరుసగా రెండోసారి విజయం సాధించని నాలుగో అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు. వచ్చే ఏడాది జనవరి 20న బైడెన్ పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. కమలా హారిస్ దేశ ఉపాధ్యక్షురాలు కానున్నారు. అంతేనా, 77 ఏళ్ల వయసులో ఈ పదవిని చేపట్టబోతున్న అతి పెద్ద వయస్కుడు బైడెన్ అయితే.. 56 ఏళ్ల వయసులో అతి పిన్నవయస్కురాలిగా కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.
అమెరికా ఎన్నికల ఫలితాల్లో 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన బైడెన్ తొలి రోజు నుంచే విజయానికి ఒక్క అడుగు దూరంలో నిలిచిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా కౌంటింగ్ కొన…సాగుతూ రావడంతో విజేత ఎవరనేది తేలలేదు. చివరికి, స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11.30 గంటలకు పెన్సిల్వేనియాలో కౌంటింగ్ ముగిసింది. జో బైడెన్ 33,45,906 (49.7%) ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ ట్రంప్ 33,11,448 (49.2%) ఓట్లను మాత్రమే సాధించారు. దాంతో, డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించినట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాలి. పెన్సిల్వేనియాలో విజయం సాధించడం ద్వారా బైడెన్ 284 ఓట్లు సాధించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నెవాడాలోనూ డెమొక్రటిక్ పార్టీ విజయ ఢంకా మోగించింది. దాంతో, శనివారం తుది ఫలితాలు వెలువడే సమయానికి డెమొక్రటిక్ పార్టీ 290 ఎలక్టోరల్ సీట్లను సాధించినట్లు అయింది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ మాత్రం 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమైంది. దాంతో, బైడెన్ విజయం సాధించినట్లు అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలన్నీ ప్రకటించాయి. ఇప్పటి వరకూ ఓపిక పట్టిన బైడెన్ కూడా కొత్త అధ్యక్షుడిని తానేనని ప్రకటించుకున్నారు. ఒక్క ట్రంప్ మాత్రమే ఇంకా ఫలితాలను జీర్ణించుకోలేదు. ఇప్పటికీ విజేతను తానే అంటూ ఆయన బీరాలు పోతున్నారు. ఇక, నార్త్ కరోలినా, జార్జియా రాష్ట్రాల ఫలితాలు మాత్రమే వెలువడాల్సి ఉంది. వీటిలో, నార్త్ కరోలినాలో రిపబ్లికన్లు, జార్జియాలో డెమొక్రాట్లు ముందంజలో ఉన్నారు. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన బైడెన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు.