అందరికి ఉచితంగా వ్యాక్సిన్

 వాక్సినేషన్ అందరికీ ఉచితం 
వ్యాక్సినేషన్ ను నేనే పర్యవేక్షిస్తా 

రూ.2500 కోట్లు ఖర్చు

 ముఖ్యమంత్రి కేసీఆర్ 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణలోని నాలుగు కోట్లమందిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ (టీకా) ఇవ్వడం జరిగిందని, మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రతివారికీ వాక్సినేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి 2500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందనీ చెప్పారు.ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదనీ, అందరికీ వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందనీ కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సిఎం కేసీఆర్ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని తెలిపారు.వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రెండు-మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరిన తరువాత సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. వాక్సినేషన్  కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. వాక్సినేషన్ కార్యక్రమం పటిష్టంగా, విజయవంతంగా అమలు చేయడానికి జిల్లాలవారీగా ఇంచార్జులను నియమించడం కూడా జరుగుతుందని సిఎం కేసీఆర్ చెప్పారు. వాక్సినేషన్ కార్యక్రమంతో పాటు, రెండీ సివిర్ తదితర కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్ కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని, కరోనా సోకినవారికి పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తుందని, ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, పెద్ద ఎత్తున సానిటేషన్ చేపట్టుతుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ప్రజలను అధైర్య పడవద్దని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వుండవద్దని సిఎం కోరారు. పెద్ద ఎత్తున గుంపు-గుంపులుగా కూడవద్దని, ఊరేగింపులలో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని, స్వయం క్రమశిక్షణ పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *