అంగన్ వాడీ ఉద్యోగులకు ముందే వేతనాలు : సత్యవతి రాథోడ్

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : అంగన్ వాడీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పండగ నేపథ్యంలో అంగన్ వాడీ ఉద్యోగులకు ముందే వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడిగిన వెంటనే అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాల కోసం నిధులు విడుదల చేయడంపై గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెల మాసాంతంలో వేతనాలు అందుతున్నాయి. అయితే ఈ నెలలో దసరా పండగ మొదటి వారంలోనే రావడంతో వేతనాలు లేకపోవడం వల్ల పండగకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని తెలంగాణ అంగన్ వాడీ సంఘం నేతలు మంగళవారం(01.10.2019) నాడు మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిసి వేతనాలు ఇప్పించాలని కోరారు. అంగన్ వాడీల విజ్ణప్తిని మంత్రి సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. వెంటనే స్పందించిన సిఎం ఉద్యోగులకు వేతనాల కోసం నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. దీంతో మంగళవారం రాత్రి(01.10.2019) అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాల నిమిత్తం 83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అంగన్ వాడీ ఉద్యోగులకు వేతనాలు అందనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. అంగన్ వాడీ ఉద్యోగుల కోసం అడగ్గానే నిధులిచ్చిన సీఎం కేసిఆర్ మొదటినుంచి అంగన్ వాడీ ఉద్యోగులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్ వాడీ ఉద్యోగులకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణదే అన్నారు. గత పాలకులు వేతనాలు పెంచమని అడిగిన అంగన్ వాడీ ఉద్యోగులను గుర్రాలతో తొక్కిస్తే…తమ ప్రభుత్వం వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని చెప్పారు. పండగ కోసం వేతనాలు ఇవ్వమని అడిగిన ఒక్క రోజులోనే నిధులు విడుదల చేసిన మనసున్న మారాజు సీఎం అని మంత్రి కొనియాడారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందన్నారు. మహిళల కోసం బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి పెళ్లి చేసే వరకు ప్రతి స్థాయిలో బాలికలు, మహిళల కోసం దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కేసిఆర్ నాయకత్వంలో అమలవుతున్నాయని మంత్రి అన్నారు. అడిగిన వెంటనే స్పందించి తమ సమస్యలను సిఎం కేసిఆర్  దృష్టికి తీసుకెళ్లి పండగ కోసం వేతనాలు ఇప్పించిన మంత్రి సత్యవతి రాథోడ్ గారికి తెలంగాణ అంగన్ వాడీ ఉపాధ్యాయులు, ఆయాల సంఘం అధ్యక్షురాలు బిక్షపమ్మ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడంలో విజయవంతమవుతామని వారు ఈ సందర్భంగా తెలిపారు.

 

 

tags : anganwadi, satyavathi rathod, cm kcr

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *